Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                

ఆర్.గణేష్

శతావధాని, రచయిత, ఆశుకవి

ఆర్.గణేష్ బహుభాషావధాని. ఇతడు ఒకే రోజు 8 భాషలలో సంపూర్ణశతావధానాన్ని చేశాడు.

ఆర్.గణేష్
ఆర్.గణేష్
పుట్టిన తేదీ, స్థలం (1962-12-04) 1962 డిసెంబరు 4 (వయసు 61)
కోలార్, కోలార్ జిల్లా, కర్ణాటక, భారతదేశం
వృత్తిఅవధాని, ఆశుకవి, రచయిత
జాతీయతభారతీయుడు
విషయంసంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం
Website
http://padyapaana.com

జీవిత విశేషాలు

మార్చు

గణేశ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ పట్టణంలో 1962, డిసెంబర్ 4న అలమేలమ్మ, శంకరనారాయణ అయ్యర్ దంపతులకు జన్మించాడు.[1][2] ఇతని ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య బెంగుళూరులో గడిచింది. ఉన్నత విద్యను గౌరీబిదనూరులో చదివాడు. తరువాత బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగులో బి.ఇ.డిగ్రీని 1985లో తీసుకున్నాడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి మెటలర్జీలో ఎం.ఎస్సీ చదివాడు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి సంస్కృత భాషా సాహిత్యాలలో ఎం.ఎ.డిగ్రీని పుచ్చుకున్నాడు. ఆ తర్వాత అవధాన కళ అనే అంశంపై పరిశోధించి హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయం నుండి డి.లిట్., పట్టా పొందాడు.

ఇతడు ఛందశ్శాస్త్రము, అలంకార శాస్త్రము, వైదిక వాఙ్మయము, వ్యాకరణశాస్త్రము, షడ్దర్శనాలు, ధర్మశాస్త్రము, చరిత్ర, జీవ శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, సాంకేతిక విద్యలను బాగుగా అధ్యయనం చేశాడు. ఆయా శాస్త్రాలలో పరిశోధనలు చేయడమే కాక పలు నూతన అంశాలను కనుగొన్నాడు. ఇతనికి కన్నడ, సంస్కృతము, ఇంగ్లీషు, ప్రాకృతం, పాళీ, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ భాషలలో మంచి పాండిత్యం ఉంది. అంతేకాక గ్రీకు, లాటిన్, ఇటాలియన్ భాషలను కూడా అధ్యయనం చేశాడు. సంగీతం, నృత్యం, తైలవర్ణ చిత్రకళలో ఆరితేరినాడు.

ఇతడు 1985-88 సంవత్సరాలలో బెంగళూరులోని ఆర్.వి.ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంటులో లెక్చరర్‌గా, 1991-92 మధ్య ఎం.ఎస్.రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. 1992-1997 మధ్యకాలంలో బెంగళూరులోని భారతీయ విద్యాభవన్‌లో సంస్కృత అధ్యయనశాఖకు డైరెక్టర్‌గా, 1997 నుండి అకాడమీ ఫర్ క్రియేటివ్ టీచింగ్ ఇన్ హ్యూమన్, సైంటిఫిక్, స్పిరిచువల్ వేల్యూస్ అనే సంస్థలో పనిచేస్తున్నాడు. మధ్యలో 2002 నుండి 2005 వరకు ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌లో రీసెర్చ్ ఆఫీసర్‌గా పనిచేశాడు.

అవధాన విశేషాలు

మార్చు

ఇతడు తన తొలి అవధానాన్ని తన స్వగ్రామం కోలార్‌లో 1987లో డి.వి.గుండప్ప శతజయంతి ఉత్సవాలలో వేలాది ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించాడు. అప్పటి నుండి నేటి వరకు 1300కు పైగా అవధాన ప్రదర్శనలిచ్చాడు. 1000వ అవధానం 2014 ఫిబ్రవరి 14న బెంగళూరులో నిర్వహించాడు.[3] ఇతడు ఇంత వరకు ద్విగుణిత ద్విభాషాష్టావధానాలు రెండు, త్రిగుణిత త్రిభాషాష్టావధానాలు రెండు, చతుర్గుణిత చతుర్భాషాష్టావధానాలు రెండు, శతావధానాలు నాలుగు చేశాడు. ఇతడు రామాయణావధానము, మహాభారతావధానము, అద్వైతావధానము, శంకరావధానము మొదలైన ప్రత్యేక అవధానాలను చేశాడు. ఇతడు ఒకే రోజులో 8 భాషలలో 108 కవితలతో ఏకదిన శతావధానం చేశాడు. ఒకే సమయంలో కన్నడభాషలోను, సంస్కృత భాషలోను యుగళావధానం చేశాడు. ఇతని అవధానాలలో నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, చిత్రకవిత్వం, ఆశుకవిత్వం, కావ్యవాచకం, అప్రస్తుత ప్రసంగం, సంఖ్యాబంధం(మ్యాజిక్ స్క్వేర్), న్యస్తాక్షరి, గుణితాక్షరి, ఉద్ధిష్టాక్షరి, ఘంటా గణనం, చిత్రలేఖనం, ఆశుగీతం, అన్యోక్తి, భాషాంతరీకరణం, శ్లోకాభినయమ్‌, చతురంగం, అన్యభాషా కవిత్వం, వ్యస్తాక్షరి, శాస్త్రచర్చ, ఛందోభాషణం, భాషాంతరోపన్యాసం మొదలైన అంశాలు ఉన్నాయి. ఇతని శతావధానంలో సంస్కృతం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు, అరవం, పాళి, ప్రాకృత భాషలున్నాయి. ఇన్ని భాషలలో అవధానాలలో ఛందోబద్ధమైన కవిత్వం చెప్పినవాడు ఇతడు ఒక్కడే. కర్ణాటక రాష్ట్రంలో గల ఏకైక శతావధాని ఇతడు. ఇతడు చేసిన అవధానాలలో 225 రకములైన ఛందస్సులను ఉపయోగించాడు. ఇతడు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, పల్లెలతో పాటు న్యూఢిల్లీ, ముంబాయి, కాశి, ఉజ్జయిని, హైదరాబాదు, తిరుపతి, చెన్నై, త్రివేండ్రం, మధురై వంటి ప్రదేశాలలో, అమెరికా, ఇంగ్లాండు దేశాలలో అవధానాలు చేశాడు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో కూడా ఇతడు అవధానాలను నిర్వహించాడు. ఇతడు అవధానాలలో చిత్ర కవిత్వాన్ని ప్రవేశపెట్టాడు. మృదంగ బంధము, హార బంధము, గోమూత్రికా బంధము మొదలైన బంధకవిత్వాన్ని చెప్పాడు.

అవధానాలనుండి కొన్ని పద్యాలు

మార్చు

ఇతని అవధానాల నుండి ఉదాహరణకు కొన్ని పద్యాలు:[2]

  • తెలుగు దత్తపదిలో ముల్లా-ఖాజి-పాద్రి-పోపు అనే పదాలతో విష్ణుస్తుతి చేయమని కోరగా చెప్పిన పద్యం.

తే||గీ|| శ్రీ సముల్లాసియై సదా శ్రితజనులకు
విపుల దుఃఖాజి రాజిలో విజయకారి
జాత రూపాద్రిధారి సంస్తవములందు
హరి కపో పునర్భవమిచ్చి కరుణనేలు

  • సంస్కృత ఛందస్సులో ఇంగ్లీషు పద్యం.

సింగింగ్ కుక్కూస్ స్ప్రింగ్ అరౌండ్ స్వీట్లి జెంట్లీ
డాన్సింగ్ కౌబాయ్స్ ప్లే ది ఫ్లూట్స్ జాయ్‌ఫుల్లీ అండ్
సింగింగ్ డ్యామ్సెల్స్ స్టోర్ట్ దెయిర్ అక్యూట్ డిసైర్స్ సో
స్ప్రింగింగ్ స్ప్రింగ్ ఈస్ హంటింగ్ అజ్ విత్ ద ఫ్లోరా

రచనలు

మార్చు

కన్నడ

మార్చు
  • నిత్యనీతి
  • కవితె గొందు కథె
  • శతావధాన శారదె
  • విటాన
  • సామాన్య ధర్మ
  • నీలకంఠ దీక్షితన శతకత్రయ
  • ద్రషతాంత కలికా శతక మత్తు శాంతి విలాస
  • సంధ్యా దర్శన
  • షడ్దర్శన సంగ్రహ
  • వంశీ సందేశ
  • ధూమదూత
  • ద్రావిడ ఛందస్సు
  • పరోక్ష
  • రాగ రత్నమాలిక
  • కన్నడదల్లి అవధాన కళె - (హంపీ లోని కన్నడ విశ్వవిద్యాలయం నుండి మొదటి డి.లిట్.సిద్ధాంత గ్రంథం)
  • డి.వి.జి. అవర బెళె బాళువ బరహగళు
  • భైరవప్ప కృతిగళ సూక్తి సంపద
  • సర్వతంత్ర స్వతంత్ర ప్రొ. సా.కృ.రామచంద్రరావ్, జీవన లేఖన పరిచయ
  • భాషాభృంగద బెన్నేరి - భాషె, సాహిత్య కురిత వివేచనగళు
  • అభిరుచి - లలిత ప్రబంధగళు
  • విభూతి పురుష విద్యారణ్య
  • భైరవప్పర సాహిత్యదల్లి మౌల్య ప్రజ్ఞె
  • హొక్కుళ బళ్ళియ సంబంధ: సంస్కృతి, దర్శన, వివేచనగళు
  • కావ్యకల్ప
  • యక్షరాత్రి:యక్షగాన మత్తు రంగకళాసంబంధిత లేఖనగళ సంకలన
  • కళాకౌతుక

సంస్కృతం

మార్చు
  • మధు సద్మ
  • కామాక్షీ సుప్రభాతమ్‌
  • శతావధాని రచనా సంచయమ్‌
  • శ్రీ చెక్రేశ్వరీ స్తవనమ్‌
  • శ్రీ రామచంద్ర సుప్రభాతమ్‌
  • వనితా కవితోత్సవః

ఇంగ్లీషు

మార్చు
  • అలంకారశాస్త్ర
  • హ్యూమన్ వేల్యూస్ ఇన్ ది రామాయణ
  • స్టోరీస్ బిహైండ్ ది వెర్సెస్

మూలాలు

మార్చు
  1. S. Ranganath (2009), Modern Sanskrit Writings in Karnataka (PDF), New Delhi: Rashtriya Sanskrit Sansthan, pp. iii, iv, viii, ix, 74–76
  2. 2.0 2.1 రాపాక ఏకాంబరాచార్యులు (1 June 2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 763–768.
  3. "ಕತ್ತಲಿಗಿಂತ ಬೆಳಕಿನ ಹಿಂದೆ ಓಡುವುದು ಒಳ್ಳೆಯದು: ಸಾವಿರದ ಅಷ್ಟಾವಧಾನದಲ್ಲಿ ಪಂಡಿತರ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಸರಾಗವಾಗಿ ಉತ್ತರಿಸಿದ ಅವಧಾನಿ ಡಾ. ಆರ್. ಗಣೇಶ್‌". Vijayavani. Bangalore. 17 ఫిబ్రవరి 2014. Archived from the original on 4 మార్చి 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్.గణేష్&oldid=3899539" నుండి వెలికితీశారు