Location via proxy:   [ UP ]  
[Report a bug]   [Manage cookies]                
Jump to content

ఆలంపూర్

అక్షాంశ రేఖాంశాలు: 15°52′38″N 78°08′07″E / 15.877139°N 78.135252°E / 15.877139; 78.135252
వికీపీడియా నుండి
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలోని అలంపురం గ్రామం కొరకు చూడండి.)
ఆలంపురం
ఆలంపూర్ దేవాలయాలు
ఆలంపూర్ దేవాలయాలు
ఆలంపురం is located in Telangana
ఆలంపురం
ఆలంపురం
తెలంగాణ రాష్టంలో ప్రాంతం
భౌగోళికాంశాలు :15°52′38″N 78°08′07″E / 15.877139°N 78.135252°E / 15.877139; 78.135252
పేరు
ఇతర పేర్లు:దక్షిణ కాశీ
హలంపురం
హటాంపురం
ప్రధాన పేరు :ఆలంపురం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:జోగులాంబ గద్వాల
ప్రదేశం:ఆలంపూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ముఖ్య_ఉత్సవాలు:శివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:9
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ. 702
సృష్టికర్త:బాదామి చాళుక్యులు

ఆలంపురం , తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది

తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న అలంపూర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]

చరిత్ర

[మార్చు]

11, 12 శతాబ్దాల నాటికే ఆలంపూర్ ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా పేరొందింది. కర్ణాటక ప్రాంతానికి వెళ్ళే రాచబాటలో నెలకొనడంతో పట్టణంలో వ్యాపారం వృద్ధి చెందింది. ఉభయ నానాదశ వర్తక కేంద్రం పట్టణంలో నెలకొన్నట్టు ఆలంపూర్లో దొరికిన శాసనాల్లో ఒకటి పేర్కొంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2442 ఇళ్లతో, 12609 జనాభాతో 5247 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6790, ఆడవారి సంఖ్య 5819. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2875 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 81. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576440.[4]

సౌకర్యాలు

[మార్చు]
  • విద్యా సౌకర్యాలు - మాంటిస్సోరి విద్యాలయం జిల్లాలోనే అతి పెద్ద గురుకుల విద్యాలయం.గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కర్నూలులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ కర్నూలులో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలులో ఉన్నాయి.
  • వైద్య సౌకర్యం
  • ప్రభుత్వ వైద్య సౌకర్యం - ఆలంపూర్లో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
  • ప్రైవేటు వైద్య సౌకర్యం - గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.
  • తాగు నీరు - గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
  • పారిశుధ్యం - మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
  • సమాచార, రవాణా సౌకర్యాలు - ఆలంపూర్లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.అలంపురానికి హైదారాబాదు, కర్నూలు, మహబూబ్‌ నగర్‌ ల నుంచి బస్సు సర్వీసులు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
  • మార్కెటింగు, బ్యాంకింగు - గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
  • ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు - గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
  • విద్యుత్తు - గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
  • నీటిపారుదల సౌకర్యాలు - ఆలంపూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. బావులు/బోరు బావులు: 238 హెక్టార్లు

భూమి వినియోగం

[మార్చు]

ఆలంపూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 362 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 134 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 283 హెక్టార్లు
  • బంజరు భూమి: 1226 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 3238 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 4510 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 238 హెక్టార్లు

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్న

విశేషాలు , చారిత్రక, పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం.ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం ఉంది. భారతదేశంలోని 18 శక్తిపీఠాలలో ఇది ఒకటి.[5] ఇది హైదరాబాదు నకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావింపబడింది. (సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంలు దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా భావింపబడినాయి). తుంగభద్ర, కృష్ణా నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించారు. అలంపూర్ చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. తుంగభద్ర నది ఎడమ గట్టున అలంపూర్ ఆలయం ఉంది. శాతవాహన, బాదామీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, గోల్కొండకి చెందిన కుతుబ్‌ షాహీ ల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది. జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి.

దేవాలయాలు

[మార్చు]
బాల బ్రహ్మేశ్వర దేవాలయం, అలంపూర్
  • నవబ్రహ్మ ఆలయాలు - నవబ్రహ్మ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు సుమారుగా ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి రెండువందల సంవత్సరములు పాలించారు. ఈ బాదామి చాళుక్యులు కర్ణాటక, తెలంగాణ లలో చాలా దేవాలయములు నిర్మించారు. ఇక్కడి కొన్ని శిల్పాలను దగ్గరలోని ఆలంపూర్ మ్యూజియంలో ఉంచారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనునవి ఆ తొమ్మిది దేవాలయములు. ఇవి అన్నీ కూడా తుంగభద్రానది ఒడ్డున ఉన్నాయి. వీటిలో బాల బ్రహ్మేశ్వరాలయం పెద్దది, ఇక్కడి శాసనాల ఆధారంగా దీనిని క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా గుర్తించారు. ఇక్కడ శివరాత్రి పండుగను ఘనంగా చేస్తారు.
  • తారక బ్రహ్మ దేవాలయం - ఈ ఆలయం పాక్షికంగా శిథిలాలలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు! దీనియందు ఆరు, ఏడవ శతాబ్దాలకు చెందిన తెలుగు శాసనాలు ఉన్నాయి.
  • స్వర్గ బ్రహ్మ దేవాలయం - అలంపూర్ లోని దేవాలయాలలో సుందరమైందిగా చెప్పబడుతుంది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందులో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన చాలా శాసనాలు ఉన్నాయి.
  • పద్మ బ్రహ్మ దేవాలయం. - ఇది కూడా పాక్షికంగా శిథిలమైంది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం ఉంది.
  • విశ్వబ్రహ్మ దేవాలయం - చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారత దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కారు.
  • బాల బ్రహ్మేశ్వరాలయం - నవ బ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైంది. జోగులాంబాలయం పునర్నిర్మాణం జరిగే వరకు ఇక్కడ ప్రధానార్చకాలయం ఇదే. జోగులాంబ పూర్వపు గుడి విధ్వంసం జరిగాకా, కొత్త ఆలయం నిర్మించేదాకా ఈ స్వామి ఆలయంలోనే పూజలందుకుంది. ఈ దేవాలయం చుట్టూ బహిఃప్రదిక్షణాపథాన్ని, ప్రాకారాన్ని, ముఖమంటపాన్ని చాళుక్య విజయాదిత్యుడు కట్టించినట్లు తెలుస్తుంది. ఈ నిర్మాణాలలో శిల్పి ఈశాన్యాచారుడి కృషి చెప్పుకోదగినదని అంటారు.
జోగులాంబ దేవాలయం, అలంపూర్
  • జోగులాంబ ఆలయం - జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగా నెలకొని ఉంది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం. జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.
  • సూర్యనారాయణస్వామి దేవాలయం - 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో ఉన్నాయి. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది. శక్తిపీఠాన్ని సందర్శించడానికి వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.
సంగమేశ్వర దేవాలయం, అలంపూర్
  • సంగమేశ్వరాలయం - అలంపూర్‌కు ఈశాన్యంలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రాంతంలో కూడవెల్లి అను గ్రామం ఉండేది. ఇక్కడే సంగమేశ్వరాలయం ఉండేది. ఈ గ్రామం, ఆలయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం వలన ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామంలోని ప్రజలు సమీప గ్రామాలలో పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇక్కడి సంగమేశ్వరాలయాన్ని తరలించి అలంపూర్‌లో పునర్నిర్మించారు. గ్రామంలో జూనియర్ కళాశాలకు సమీపంలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించారు. ఈ ఆలయ శిల్పసంపద ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలిలోనిదే. శివరాత్రి పర్వదినాన ఇక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విశాలమైన తోటలో ఆలయం అలరారుతుంది.
  • తారక బ్రహ్మాలయం - ఈ ఆలయము గోపురములు శిథిలమై పోయినవి. ఇందలి గోడలపై అద్భుతమైన శిల్పములు ఉన్నాయి. ఇందొక ముఖమండపము, దానివెనుక ఒక ప్రవేశమంటపము, దానిని చేరి గర్భాలయము ఉన్నాయి.ప్రవేశమంటపము చుట్టును సన్నను వసారా ఉంది.దీనిలో నడుచుచు ప్రదక్షిణము చేయవచ్చును.ఆలయములో స్తంభములు బలిష్ఠముగా కట్టాబడినవి.
  • శూలక బ్రహ్మాలయం -ఈ దేవాలయం ప్రాజ్ముఖంగా ఉంది. దీని యెదుట ఒక ప్రాంగణం ఉంది. అటుపై ఒక వసార ప్రవేశ మంటపె ఉంది. దీనిలో ప్రదక్షిణం చేయవచ్చును.పిమ్మట అంతరాళమంటపం, అటుపై గర్భాలయం ఉన్నాయి. ఈ గుడిలో ఒక వేదికపై లింగం ప్రతిష్ఠింపబడింది. ఈవేదికకు నాలుగు వైపులను రాతిస్తంభాలు ఉన్నాయి. వేదిక చుట్టూన్న ప్రదేశం రెండవ ప్రదక్షిణ మార్గంగా ఉంది.ఈ ఆలయెలో తాండవనృత్యం చేయు శివుని విగ్రహ శిల్పం, ప్రణయగోష్ఠిలో నున్న గంధర్వ దంపతుల బొమ్మలు ఉన్నాయి.
  • కుమార బ్రహ్మాలయం - ఆలయం ఒక రాతిచపటాపై ప్రాజ్ముఖంగా నిర్మింపబడింది.ఇందు ముఖమంటపం, ప్రవేశమంటపం, వానివెనుక గర్భాలయాలు ఉన్నాయి. ఇచటి స్తంభాలపై చెక్కడపుపని ఎల్లోరా అజంతా శిల్పాలను స్మృతికి తెచ్చును.
  • అర్క బ్రహ్మాలయం - ఈ ఆలయం కుమారబ్రహ్మ గుడివలెనే నిర్మించబడింది.ఇందులో ప్రదక్షిణకుపయోగించు చుట్టువసారా ఒక విశేషము.గోడలి వెలుపలిభాగమున చక్కని నగిషీ పని కల స్తంభములతో నిర్మింపబడిన గూళ్ళు కలవు వీనినడుమ హిందూదేవతల విగ్రహములున్నవి.
  • మసీదు దేవాలయం - ఇది పూర్వమొక శివాలయంగా ఉండేది. ఇందు ముఖమంటపంను, ప్రవేశమంటపంను, దీనిచుట్టును ప్రదక్షిణార్ధం ఉపయోగించెడి వసారా, వానివెనుక గర్భాలయం ఉండేవి. గర్భాలయాలలో వేదిక ఉండేది. స్థలంలో ఒక అడ్డగోడ పెట్టబడింది. దీని కెదురుగనే నేడు మహమ్మదీయులు నమాజ్ చేస్తున్నారు. ఈకట్టడపు గోడవెలుప భాగాన నాల్గు శాసనాలు చెక్కబడినవి.
  • బాల బ్రహ్మాలయం - అలంపురం ఆలయాలలో కెల్లా ఇది ముఖ్యమైంది.ఇందు నిత్యపూజాదికాలు జరుగుతాయి.తూర్పుముఖంగా నున్న ఈఆలయంలో చిన్న నంది మంటపంను, దానివెనకల విశాలమగు ముఖమంటపం, అటుపై అంతకంటే పెద్దదైన ప్రవేశ మంటపం, అటుపై అంతరాళ మంటపం దానిని చేరి గర్భాలయం ఉన్నాయి.గర్భాలయం చుట్టూనున్న వసార ప్రదక్షిణకు ఉపయోగిస్తారు. ఈగుడిలో సప్తర్షులు విగ్రహములు, ఇతర శైవదేవతల విగ్రహాలున్నవి. ఈఆలయం చుట్టును చిన్నచిన్న గుడులు ఉన్నాయి. ఈ ఆలయంలోని లింగం వింతగా నుండును. వేదికపై నున్న శిలాలింగం మధ్యనొక బిలం ఉంది. దానిలో మరియొక లింగం ఉంది. పైకవచాన్ని తీసి సవిమర్సనగా చూచినగాని ఈఅంతర్లింగం కనబడదు.ఈ ఆలయపు ఆవరణలో నున్న విగ్రహములలోకెల్లా ఒక విగ్రహం వింతగా నున్నది. ఒక నల్లరాతిపైన నగ్నమై, రెండు మోకాళ్ళను దౌడలకు తగులునట్లు మడచుకొని కూర్చొని ఉన్న స్త్రీ మూర్తి చెక్కబడి ఉంది. ఇది భూదేవి విగ్రహమట.
  • పాపనాశనం - అలంపురం సమీపంలోని పాపనాశంలో ఇరవై దేవాలయాలు ఒకేచోట ఉండటం వల్ల అలంపురం ఆలయాల పట్టణంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకూ దక్షిణాపథాన్ని పరిపాలించిన రాజవంశీయుల శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ప్రాచీన శిల్పకళకు కాణాచి అయిన ఈ ఆలయం అడుగడుగునా విజ్ఞాన విశేషాలకు ఆలవాలంగా ఉంది. వైదిక మతానికి చెందిన ఆలయాలు, జైన, బౌద్ధుల కాలం నాటి శిల్పనిర్మాణాలు ఇక్కడ ఎన్నో దర్శనమిస్తాయి.ఆలయం తోటను ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఇటీవల త్రవ్వకాలు జరపగా, శాతవాహనుల కాలం నాటి నాణాలు, పూసలు, శంఖాలు, పాత ఇటుకలు, మట్టి పాత్రలు బయటపడ్డాయి. ఈ ఆలయం మహాద్వారాన్ని రాష్ట్ర కూటుల హయాంలో నిర్మించినట్టు చారిత్రక కథనం. కాకతీయుల కాలంలో ఇక్కడ మండపాలను నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయులు రాయచూర్‌ నుంచి ఈ ఆలయానికి వచ్చి కొన్ని దానాలు చేసినట్టు కూడా చారిత్రక కథనం. గతంలో ఇక్కడ ప్రసిద్ధమైన విద్యాపీఠం ఉండేదనీ, మహావిద్వాంసులు ఎంతో మంది ఉండేవారని కూడా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
పురావస్తు ప్రదర్శనశాల, ఆలంపూర్
  • ఆలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల - ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉంది. దీనిని 1952లో ఏర్పాటుచేశారు. ఇందులో సా.శ.6 వ శతాబ్దము నుంచి సా.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు. దేవాలయానికి వచ్చే యాత్రికులు దీనిని కూడా సందర్శిస్తారు.
  • రక్షణ గోడ - అలంపూర్ పట్టణానికి చుట్టూ అన్ని వైపులా రక్షణ గోడ ఉంది. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో అలంపూర్ కూడా ఒకటి. కాని ముంపుకు గురై పట్టణాన్ని వేరేచోట నిర్మిస్తే, పట్టణంలోని ఆలయాలు పాడై, పునర్నిర్మాణ అసాధ్యమై, వాటి ప్రాభవాన్ని కోల్పోతాయని భావించి, అది ఊరికి అరిష్టంగా తలచి, అప్పటి ఆలయ ధర్మకర్త, ప్రముఖ కవి, చారిత్రక పరిశోధకులు గడియారం రామకృష్ణ శర్మ గారు ఊరి పెద్దలను ఒప్పించి, గ్రామ పున నిర్మాణానికి దక్కే నష్టపరిహారపు సొమ్మును వినియోగించి పట్టణం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి, నిర్మించారు. ఈ రక్షణ వలయం ఊరి చుట్టూ ఉన్నప్పటికి పశ్చిమం వైపు ఎత్తు తక్కువగానూ, తూర్పు వైపు నది ఉండటం వలన అత్యంత ఎత్తులోనూ ఉండి, కోటగోడను తలపిస్తుంది, వర్షా కాలంలో నది జోరుగా ప్రవహించినా ఈ నిర్మాణం వలన నీరు పట్టణంలోకి రాదు. పట్టణంలోని మురికి నీరంతా ఊరి మధ్యలోని జోగులాంబ వాగులోకి చేరుతుంది. ఈ నీరు తుంగభద్ర వైపు వెలుతుంది. అయితే రక్షణ గోడ అడ్డు ఉండటం వలన నీటిని మోటారులతో ఎత్తి నదిలోకి చేరుస్తుంటారు.

ఇతర విశేషాలు

[మార్చు]
  • 2009 అక్టోబరు వరదలు: 2009 అక్టోబరు 2న తుంగభద్ర నది ఉప్పొంగడంతో ఆలంపూర్ గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.[6] అధికారులు గ్రామం మొత్తం ఖాళీచేయించారు. తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన రక్షణ గోడపై నుంచి నీరు ప్రవహించడంతో వరదనీరు గ్రామంలోకి ప్రవేశించి గ్రామస్థులందరినీ నిరాశ్రయులుగా చేసింది. పురాతన ఆలయాలు అన్నీ నీటమునిగాయి.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  1. అబ్దుల్ ఆజీం దఢాఖ: వాగ్గేయకారుడు.[7]
  2. జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, లోకాయుక్త మాజీ జస్టిస్‌, ఎమ్మెల్సీ.[8]

అలంపూర్ ఆలయాల చిత్రాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 8 April 2021.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 245
  6. ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009
  7. "వాగ్గేయ వైభవం |-Sunday Weekly magazine". web.archive.org. 2019-09-16. Archived from the original on 2019-09-16. Retrieved 2022-03-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత". Sakshi. 2022-11-18. Archived from the original on 2022-11-21. Retrieved 2022-11-21.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆలంపూర్&oldid=4328673" నుండి వెలికితీశారు